Saturday, March 05, 2011

ఏదీ తెలంగాణ ‘విమోచన’ తేదీ

ఏదీ తెలంగాణ ‘విమోచన’ తేదీ
Abhiprayam-Editorial

Sakshi   శనివారం : 05/03/2011

తెలంగాణ ఇవ్వటానికైతే సరైన సమయాలు చాలా వచ్చాయి. తెలంగాణ ప్రజలకు మొండిచేయి చూపించటానికే ఇంకా సరైన సమయం రాలేదు కాబోలు- ఏదో ఒక రోజు అధిష్టానం చెప్పబోయే ఆ చావు కబురు కోసం ఎదురుచూడకుండా జై తెలంగాణ-జై ఆంధ్ర అనే వాళ్లందరూ పార్టీల జెండాలు, అజెండాలను పక్కనపెట్టి మహత్తర ఉద్యమాలతో మొండి ప్రభుత్వాల మెడలు వంచి తమతమ లక్ష్యాలను సాధించుకోవాలి.
తెలంగాణ అంశంపై తప్పుడు సమాచారం, తప్పుడు అభిప్రాయాలతో ఒక వాస్తవ దూరమైన నివేదికను వండివార్చి శ్రీకృష్ణ కమిటీ చేసిన వంచన నుంచి తెలంగాణ ప్రజలు ఇంకా కోలుకోక ముందే, కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం సరిగ్గా 15 నెలల అనంతరం రెండోసారి తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపడానికి పూనుకున్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ఆరంభించినట్టు ప్రకటించి మొదటిసారి మోసగించిన చిదంబరం, తాజాగా మార్చి 1వ తేదీన ‘‘తెలంగాణ విషయం రాత్రికి రాత్రి తేల్చలేం!’’ అన్న మరో ప్రకటన చేసి రెండోసారి మోసగించారు. ప్రజాఉద్యమం పతాకస్థాయిలో సాగుతున్న వర్తమాన సన్నివేశంలో చిదంబరం నీతిలేని ప్రకటన యూపీఏ సర్కార్ నిజస్వరూపాన్ని మరోమారు బట్టబయలు చేసింది.
అప్పటి వరకు తెలంగాణ విషయంలో యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు సుముఖంగా లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. 2004 వరకు సాగిన చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన పుణ్యమా అని రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడింది. తెలంగాణలో పలు ఉద్యమ సంస్థలు చంద్రబాబు ప్రజాకంటక, తెలంగాణ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టాయి. ప్రజలలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష క్రమంగా బలపడుతూ వచ్చింది. సరిగ్గా అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించటం, వెంటనే జరిగిన పంచాయతీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ సాధించిన అద్భుత విజయాలను చూసి అన్ని పార్టీల వారు అవాక్కయ్యారు. 2001-04 ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ సాగించిన ఉద్యమ ప్రస్థానాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు చిగురించాయి. ఏదోవిధంగా టీఆర్‌ఎస్‌తో జతకూడితే తప్ప టీడీపీని ఎదుర్కొని గెలువలేమన్న నిశ్చితాభిప్రాయానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ దిశగా పావులు కదిపారు.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఢిల్లీలోనైతే సంధి కుదిరింది. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను, తెలంగాణవాదులను ఒప్పించటం అంతసులభం కాదని వారికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 2వ ఎస్‌ఆర్‌సీకి కట్టుబడిన కాంగ్రెస్‌తో జతకట్టటాన్ని తెలంగాణవాదులు ఒప్పుకోరు. కనుక రెండవ ఎస్‌ఆర్‌సీకి కట్టుబడిన కాంగ్రెస్ పాత తీర్మానాన్ని ఏమాత్రం సవరిం చకుండా దానికి ‘‘మొదటి ఎస్‌ఆర్‌సీ రిపోర్టును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ అందులోని విలువైన అంశాలను పరిగణనలోనికి తీసుకున్నది’’ అనే పంచ రంగుల ముసుగు తొడిగి తెలంగాణ ప్రజలను నమ్మించారు. బెల్లం ముద్దలో పెట్టి చేదు మాత్రను మింగించినట్లు మాటల గారడీతో నమ్మబలికి టీఆర్‌ఎస్ శ్రేణులను పొత్తుకు ఒప్పించారు.

తర్వాత రెండు పార్టీలు బజారునపడే దాకా అసలు విషయం ప్రజలకు తెలియలేదు. 2వ ఎస్‌ఆర్‌సీ కాంగ్రెస్ విధానమని తెగేసి చెప్పారు. అదొక్కటే కాదు. 2004 ఎన్నికల తర్వాత యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాం(సీఎంపీ)లో తెలంగాణ గురించి మళ్లీ మాటల గారడినే ‘‘సంప్రదింపుల ద్వారా విస్తృత ఏకాభిప్రాయం సాధించి తెలంగాణ సమస్యకు సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోబడుతుంది’’ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో నాటి రాష్టప్రతి నోట ఆ మాటలనే పలికించారు.

ఈ మాత్రానికే ఇక తెలంగాణ వచ్చేసినట్లు, సోనియా దేవత తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లు భ్రమలు కల్పించి తెలంగాణలో వాడవాడలా మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి దీపావళి పండగ చేసుకొమ్మన్నారు. నిజమే కావచ్చునని జనం దీపావళి ఒక్కటే కాదు దసరా పండగ కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైంది? తెలంగాణ వచ్చిందా? ‘‘ఏకాభిప్రాయం సాధించి, సరైన సమయంలో, సముచిత పరిష్కారం సాధిస్తాం’’ అనే మాటలను జాగ్రత్తగా గమనిస్తే అందులోని మోసం అర్థం అవుతుంది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా, ఏ విషయమైనా ఏకాభిప్రాయం సాధ్యమయ్యేపనేనా? మెజారిటీ అభిప్రా యాన్ని కూడగట్టి నిర్ణయం తీసుకుంటాం అని ‘సీఎంపీ’లో అనలేదు. ఏకాభిప్రాయం ఇంకా రాలేదు, ఎన్నటికీ రాదు కనుక కాంగ్రెస్‌కు ఏ ఇబ్బందీ ఉండదన్న ధీమా అధిష్టానానిది.

పోనీ ఏదైనా గడువు ఉందా? అంటే లేదు. ‘సరైన సమయం’ ఎప్పుడొస్తుందో తెలియదు. ఏది సరైన సమయమో తెలియదు. ఇక అసలు విషయానికి వస్తే ‘‘తెలంగాణ సమస్యకు సముచిత పరిష్కారం’’ అన్నారేగాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న స్పష్టమైన హామీలేదు. సమైక్య రాష్ట్రంలో కొనసాగటమైనా, లేదా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా రెండింటిలో ఏదైనా సముచితం అని చెప్పే అవకాశం, వెసులుబాటు యూపీఏ చేతిలో ఉంచుకున్నారు. యూపీఏ 1వ అంకం ముగిసిపోయింది. తెలంగాణ రాలేదు. కాంగ్రెస్ అధిష్టానం టీఆర్‌ఎస్ పార్టీ నాయకులను మోసం చేసిందా? లేక టీఆర్‌ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు కలిసే తెలంగాణ ప్రజలను వంచించారా? ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది.

ఇక యూపీఏ మొదటి దఫా కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ ఉందని, రాష్టప్రతి ప్రసంగంలో తెలంగాణ మాట వచ్చిందని, ఇక రాష్ట్ర విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలే తరువాయి అన్నట్లుగా భ్రమలు కల్పించారు. నాటి కేంద్ర మంత్రివర్గంతో పాటు ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో టీఆర్‌ఎస్‌కు స్థానం దక్కింది. రెండు పార్టీలు హాయిగా హనీమూన్‌లో మునిగి తేలుతున్నప్పుడే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం గురించి గుసగుసలు ఊపందుకున్నాయి. ప్రజల నాడిని పసిగట్టటానికి కొందరు టీఆర్‌ఎస్ మంత్రులే స్వయంగా ‘కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ కలిస్తే తప్పేముంది?’ అని మీడియా ముందు అన్నారు. పత్రికల్లో ఆ కథనాలు వచ్చాయి.

రాష్ట్రం రాకముందే విలీనం మాటవిన్న తెలంగాణవాదుల తీవ్రవ్యతిరేకత, టీఆర్‌ఎస్ శ్రేణుల నిరసనతో విలీన ప్రక్రియకు బ్రేకుపడింది. ఆనాడున్న పరిస్థితులలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసివుంటే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనాన్ని ప్రజలు పెద్దగా తప్పుపట్టేవారు కాదు. వాస్తవంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంతోడైతే కాంగ్రెస్ ఎదురులేని శక్తిగా నిలిచేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ బాగా లబ్ధ్దిపొందే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. 2009 ఎన్నికల్లో యూపీఏకు మళ్లీ అధికారం దక్కింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చింది. అయినా మళ్లీ పాతకథే. రోశయ్య కమిటీ పేర సాగతీతే!

ఇంతలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణించరాదన్న ఆందోళన ఉధృతమైంది. 2009 నవంబర్‌లో కేసీఆర్ ఆమరణ దీక్షకు సన్నాహం, అరెస్టు, విద్యార్థుల రంగ ప్రవేశంతో ఉద్యమాల జోరు పతాక సన్నివేశానికి చేరి రోశయ్య ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆగమేఘాలమీద అన్ని పార్టీలను పిలిస్తే ఎంఐఎం, సీపీఐఎం తప్ప అందరూ తెలంగాణ ఏర్పాటుకు సై అంటే సై అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభించామని చిదంబరం ప్రకటన చేయగానే తెలంగాణలో మళ్లీ దీపావళి, హోలీ చేసుకున్నారు. తెలంగాణ భవన్‌లో సోనియా బొమ్మలు చేబూని గంతులేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమిస్తారా? అని జాతీయ మీడియా అడిగితే ‘‘సోనియా మాటతప్పదు, మళ్లీ ఉద్యమించవలసిన అవసరమేరాదు’’ అని కేసీఆర్ నమ్మబలికాడు. తెలంగాణ రాలేదు కదా 23 డిసెంబర్‌న మరోమారు తెలంగాణ ప్రజలు మోసపోయారు.

ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, మీడియా వర్గాలు సమస్త ప్రజలు నిట్టనిలువునా చీలిపోయారు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరితోనే అసలు చిక్కు. 2009లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసి రాష్ట్ర విభజన కొరకే పుట్టిన టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడు సీమాంధ్ర టీడీపీ నాయకులు ఎందుకు వ్యతిరేకించలేదు? అదే విధంగా 2004లో టీఆర్‌ఎస్‌తో జతకట్టినప్పుడుగాని, కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలలో టీఆర్‌ఎస్ నాయకులు చేరినప్పుడుగాని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించలేదు. పైగా రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమేనని తీర్మానం చేశారు. అన్ని వేదికల మీదా ఇదేమాట చెప్పారు.

ఇప్పుడు కాదనే నైతిక హక్కు వారికి లేదు. పైగా అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని వాళ్లు ఇప్పటికీ అంటున్నప్పుడు రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రారంభించకుండా అధిష్టానం ఎందుకు సాగదీస్తున్నట్టు? ఆ సరైన సమయం ఎప్పుడొస్తుందో అధిష్టాన దేవతకు తప్ప బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. తెలంగాణ ఇవ్వటానికైతే సరైన సమయాలు చాలా వచ్చాయి. తెలంగాణ ప్రజలకు మొండిచేయి చూపించటానికే ఇంకా సరైన సమయం రాలేదు కాబోలు- ఏదో ఒక రోజు అధిష్టానం చెప్పబోయే ఆ చావు కబురు కోసం ఎదురుచూడకుండా జై తెలంగాణ-జై ఆంధ్ర అనే వాళ్లందరూ పార్టీల జెండాలు, అజెండాలను పక్కనపెట్టి మహత్తర ఉద్యమాలతో మొండి ప్రభుత్వాల మెడలు వంచి తమతమ లక్ష్యాలను సాధించుకోవాలి.

సీమాంధ్రులకు ఎదురయ్యే నిజమైన సమస్యలు కేవలం మూడు మాత్రమే. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు సేద్యపునీరు, సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణ భారం, హైదరాబాద్‌తో సహా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల భద్రతకు హామీ. తెలంగాణ వాళ్లు కూడా ఈ విషయంలో తగురీతిలో ఆలోచించి సహకరించాల్సి ఉంటుంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంత దామాషా ప్రకారం కోస్తాంధ్ర, తెలంగాణలకు రావాల్సిన నీటి వాటాలలో కొంత కరువు ప్రాంతమైన రాయలసీమ సేద్యపు అవసరాల కోసం మానవతా దృష్టితో ఇవ్వాలి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు చెన్నై నగరానికి తాగునీరు ఇచ్చినట్లే రాయలసీమ సేద్యానికి కొంత త్యాగం చేయటానికి సిద్ధపడాలి. ఇక కొత్త రాజధాని నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది కనుక కేంద్రం, తెలంగాణ, సీమాంధ్ర సమానంగా భరించటానికి ముందుకు రావాలి. ఇక తెలంగాణలోగాని, హైదరాబాద్‌లోనిగాని స్థిరపడ్డ సీమాంధ్రులు ఆందోళన చెందాల్సిన పనే ఉండదు. అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నిర్భయంగా స్థిరపడినట్లే సీమాంధ్రులు కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ తీసుకుంటే పైమూడు అంశాల పరిష్కారానికి అందరూ సహకరిస్తారనటంలో సందేహం లేదు.

మందాడి సత్యనారాయణరెడ్డి

పూర్వ శాసనసభ్యులు

No comments:

Post a Comment