Monday, December 10, 2012

december 3

12/9/2012 12:10:42 AM

శ్రీకాంతాచారి... ఒక యూట్యూబ్ పాట యూట్యూబ్‌లో ఒక వీడియో...బీరెడ్డి

 


srikanth

 
లక్షా 54 వేల మంది చూసిన వీడియో...
మనసు బాగోలేనప్పుడు...
ఒంటరిగా.. అర్థరాత్రి... కొన్ని వందల సార్లు చూసిన వీడియో...
రాతిబొమ్మల్లోన.. ఏ సాంగ్ బై సాయిచంద్..
మలి తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి సంస్మరణ సభావేదిక...
ఎదురుగా కుర్చీలో శ్రీకాంత్ అమ్మ.. శంకరమ్మ..
‘‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా...
రక్తబంధం విలువ నీకు తెలియదురా..
నుదిటి రాతను రాసే ఓ బ్రహ్మ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా’’ అని పాడుతూ దరువేస్తున్న వారిని వద్దని వారిస్తున్నాడు సాయి. విజిలేస్తున్న వారికి వద్దని సైగ చేస్తున్నాడు ఒక నాయకుడు.
అంతా నిశబ్ధం. ఒక పాట.. ఒక తల్లి కన్నీటి మాట.. మాత్రమే అక్కడ వినిపిస్తున్నాయి.
అమ్మ ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. ‘తెలిసుంటె చెట్టంత శ్రీకాంతును.... ’ అని పాడినప్పుడు దోసిట్లో మొఖం దాచుకుని అమ్మ బిగ్గరగా ఏడుస్తోంది. పక్కన కూర్చున్న అక్క ఓదారుస్తోంది.
‘తెలిసుంటె చెట్టంత శ్రీకాంతును.. తిరిగి తెచ్చియ్య గలవా నీ మహిమలో...’ పాట సాగిపోతోంది. చూసే కళ్లల్లో నీరు ఉబికి వస్తుంది.
‘నువ్వు మగాడివి శివుడా! నువ్వు మగాడివి బ్రహ్మదేవుడా! తెలంగాణ బిడ్డలను పోగొట్టుకున్న తల్లి పేగు బంధం నీకు అర్థం కావాలంటే.. ఆ బాధ నిజంగా నీకు తెలియాలంటే..
పురుటి నొప్పుల బాధ ఈశ్వరా.. నీ పార్వతిని అడగరా శంకరా?
తల్లిగా పార్వతికి ఒక నీతినా...
ఈ తల్లి గుండెల మీద చితిమంటలా...?’
మూడేళ్ల క్రితం...
డిసెంబర్ 3 అర్ధరాత్రి 11 గంటల 30 నిముషాలకు ఒక ఎస్‌ఎమ్‌ఎస్...
Srikanth chanipoyaad raa... అని.
పంపింది జానీ. నా ఫ్రెండ్.
60 శాతం కాలిన దేహంతో.. డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పవూతిలో అప్పుడప్పుడే కోలుకుంటున్నాడు.
గురువారం ఉదయం ఇడ్లీ తిన్నాడని.. పళ్లరసం తాగాడని టీవీల్లో వార్తలొచ్చాయి.
కానీ; ఇంతలోనే??
జానీ భార్య సుమలతకి శ్రీకాంత్ తమ్ముడవుతాడు.
ఒకసారి పెండ్లి పత్రిక ఇచ్చేందుకు జానీతో పొడిచెడు ఊరికి పోయిన.
చిన్న ఇల్లు.. ఆ పరిసరాలు.. ఇంకా గుర్తున్నయ్.
దొండకాయ కూరతో భోజనం పెట్టింది అమ్మ. ఇంకా యాదికుంది.
2006లో శ్రీకాంత్ అంబర్‌పేటలో ఉండేవాడు. అప్పుడప్పుడు మా రూమ్‌కి వచ్చేవాడు.
నాకు తెలిసిన శ్రీకాంత్ అల్లరి పిల్లగాడు. అందంగా నవ్వేవాడు. నవ్వించేవాడు.
అందుకే, గూగుల్ ఇమేజెస్‌లో నిలు నిప్పు కణికై కనిపించే శ్రీకాంత్‌ని నేను డైజెస్ట్ చేసుకోలేను.
నా ఊహల్లో శ్రీకాంత్ బతికే ఉన్నాడు.
యూట్యూబ్ పాటలో సజీవంగా ఉన్నాడు.

ఆవేదన చెందినప్పుడు.. నేను ఆవేశంతో కాదు.. ఆర్తితో ఆత్మత్యాగం చేసుకున్నానని గుర్తు చేస్తున్నాడు.
నేను బాధలో ఉన్నప్పుడు.. తాను మంటల్లో కాలినప్పుడు ఎంత బాధ పడ్డాడో తెలియజెప్తున్నాడు.
డిసెంబర్ 9... ఒక ప్రకటన.. తెల్లారేసరికి ఒక ద్రోహం..
ఒక మిలియన్ మార్చ్.. ఒక తెలంగాణ మార్చ్..
గుండె పగిలినా..
రక్తం మరిగినా... తనలా ఆవేదన చెందొద్దంటున్నాడు.
ఓపిక పట్టమంటున్నాడు.
తెలంగాణ వస్తదని తన తరపున చెప్పమంటున్నడు.
ఆ పాటకోసం...
- యూట్యూబ్‌లో ‘రాతి బొమ్మల్లోన..’ పాటకోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి.
http://goo.gl/EKN8O
లేదంటే సెర్చ్‌లో raati bommallona అని టైప్ చేయండి.
- ‘కొల డీ’కి ‘రాతి బొమ్మల్లోన...’ పాటకి సంబంధం ఏంటి? ఈ లింక్ క్లిక్ చేయండి.
http://goo.gl/aCN8N

No comments:

Post a Comment