Showing posts with label కూట్లె రాయి తీయలేనోడు. Show all posts
Showing posts with label కూట్లె రాయి తీయలేనోడు. Show all posts

Friday, October 07, 2011

కూట్లె రాయి తీయలేనోడు ?

namasthe telangaana editorial 10/5/2011 11:31:52 PM
కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీస్తనని పోయిండట! ఆంధ్ర ప్రదేశ్ సమస్యను పరిష్కరించుకోలేని ఆంధ్ర పెత్తందారులు ఇతర రాష్ట్రాల గురించి వినిపిస్తున్న వాదనలో పసలేదని బుధవారం నాడు ప్రణబ్ ముఖర్జీ మాటలతో స్పష్టమైపోయింది. కావూరి, లగడపాటి వంటి ఆంధ్ర పెత్తందారులు రాష్ట్ర విభజనను సాఫీగా సాగించలేక, దేశ వ్యాప్తంగా ఒక విధానం ఉండాలంటూ వితండ వాదన లేవనెత్తారు. కానీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఒక ఇంగ్లిష్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల ఏర్పాటుకు ఒక అనుసరించదగిన నమూనా అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. కొన్ని వందలాది ఏళ్ళు పరిగణనలోకి తీసుకున్నా, భారత దేశంలో రాష్ట్రాల ఏర్పాటు ఏ ఒక్క నమూనా ప్రాతిపదికగా జరగలేదని ఆయన వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత బొంబాయి, మద్రాసు రాష్ట్రాల విభజనను ఆయన ఉదహరించారు.

రాజస్థాన్ అంశం ప్రస్తావించారు. అందుకే రాష్ట్రాల విభజన పరిస్థితులపై అంత లోతుగా వెళ్ళవలసిన అవసరం లేదని కూడా ప్రణబ్ వ్యాఖ్యానించారు. నిజానికి రాష్ట్రాల విభజనకు ఏ ఒక్క ప్రాతిపదిక ఉండదు. ఒక రాష్ట్రం ఏర్పడడానికి చారివూతక, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, అస్తిత్వ పరమైన అనేకానేక అంశాలలో ఏవైనా దోహదం చేయవచ్చు. పైగా తెలంగాణ విషయంలో చారివూతకంగా రూపొందిన ఒక ఏకరూపత గల రాష్ట్రాన్ని హఠాత్తుగా ముక్కలు చేయమని కోరడం లేదు. ఎస్సార్సీ సూచనలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆంధ్రతో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందువల్ల విలీనమైన తెలంగాణను మళ్ళీ విడిగా రాష్ట్రంగా చేయాలనేదే ఇప్పుడున్న డిమాండ్. విలీనం విఫలమైందనడానికి తెలంగాణ ఉద్యమమే సాక్ష్యంగా కనిపిస్తున్నది.

ప్రణబ్ ఈ ఇంటర్వ్యూలో తెలంగాణకు సంబంధించి మరికొన్ని మాటలు కూడా చెప్పారు. అవి రివాజుగా అధిష్ఠానం ఎప్పుడూ చెప్పేవే. తెలంగాణ అంశం సున్నితమైనదీ, క్లిష్టమైనదీ అని, నిర్ణీత గడువులో పరిష్కారిస్తామని చెప్పలేమని ఆయన అన్నారు. తరువాత ఏర్పడే సమస్యల గురించి దూరదృష్టితో ఆలోచించాలని అన్నారు. అయితే ఈ పడికట్టు పదజాలాన్ని పట్టుకునే ఆంధ్ర మీడియా హడలగొట్టింది. మొదటి ఎస్సార్సీ తరువాతనే ఈసమస్యలు వచ్చాయని, మధ్యలో పెద్దమనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం వంటివి కూడా ప్రస్తావించారు.

దేశమంతటికీ ఒక విధానం ఉండాలంటూ ఆంధ్ర పెత్తందారులు చేస్తున్న వాదనను ప్రణబ్ ఖండించిన అంశాన్ని ప్రస్తావించకుండా మొత్తం ఇంటర్వ్యూలో ఏ అంశం ఏ సందర్భంగా వచ్చిందో చెప్పకుండా, కేవలం ఆయన మాటల్లోని కొన్నింటిని ఉదహరిస్తూ ఆంధ్ర చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. కొన్నేళ్ళుగా ఆంధ్ర చానెళ్లు చేసిన ఇటువంటి దుష్ర్పచారం మూలంగానే అనేక మంది తెలంగాణ బిడ్డలు నైరాశ్యానికి గురై బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ పట్ల గుడ్డి వ్యతిరేకతతో ఈ చానళ్లు సున్నిత అంశాల పరిధి దాటి వ్యవహరిస్తున్నాయి. ఉద్వేగాలతో ఆడుకుంటున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నాయి. గత దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, తెలంగాణ ఉద్యమం ఎంతో ముందుకు పోయింది. ఈ ముందడుగు ఆంధ్ర పత్రికలలో కానీ, టీవీ చానెళ్లలో కానీ ప్రతిబింబించక పోవడాన్ని బట్టి ఎంత పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నాయో తెలుస్తున్నది.
ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలలో కూడా నిజాయితీ లోపించింది.

ప్రణబ్ ముఖర్జీ యుపిఎ ప్రభుత్వంలోనే సీనియర్ నాయకుడు. అనేక సమస్యల పరిష్కారంలో, సంక్షోభ పరిష్కారంలో గురుతర బాధ్యత పోషిస్తున్నారు. అటువంటి సీనియర్ నేత నోట తెలంగాణ సమస్య పరిష్కారంలో జరిగిన జాప్యం గురించి ఒక్క సంజాయిషీ కానీ, పశ్చాత్తాపం కానీ రాకపోవడం విచారకరం. 2004 ఎన్నికల తరువాత తెలంగాణ ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిన నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటైంది. ఆనాటి నుంచి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం ఒత్తిడి మేరకు తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా యధాతథ స్థితిని కాపాడుతున్నాయి. ఈ పాపంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా పాలు ఉన్నది. ఇప్పుడిక తెలంగాణ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఉపేక్షించలేని పరిస్థితి ఏర్పడింది. రోజు వారి ప్రాతిపదికన ఢిల్లీలో చర్చలు సాగుతున్నాయి.

కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ అంశాన్ని ఒక కొలిక్కి తేకుండా మొదటికి తెచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం పరిష్కార బాధ్యతను ప్రబణ్‌కు అప్పగించిందని అంటున్నారు. ప్రణబ్ త్వరలో హైదరాబాద్ వచ్చి వివిధ పార్టీలతో చర్చలు జరిపి వెళతారని తెలుస్తోంది. ఈ సందర్భంలో ప్రణబ్ వంటి సీనియర్ నాయకుడు తెలంగాణ వంటి సమస్యపై పడికట్టు పదజాలం వాడడం మాని, తమ తప్పిదాన్ని అంగీకరిస్తే ఎంతో హుందాగా ఉండేది. ఈ అంశంపై జరుగుతున్న కసరత్తును వివరించి, ఇక ముందు సాగదీయకుండా, అతి త్వరలో పరిష్కారం సాధిస్తామని ధీమాగా వివరించాల్సింది. ఇటువంటి ముదురు చర్మం నాయకులు ఉండడం వల్లనే దేశం ఈ విధంగా ప్రతి సమస్య రగులుతూ ఉన్నది. ప్రణబ్ ముఖర్జీ తన ఏకపక్ష ధోరణి వల్ల సంక్షోభ కారకుడవుతున్నడనేది ఇక్కడ గమనించాలె.

తెలంగాణ ప్రజలు ప్రణబ్ ముఖర్జీ సంక్షోభ పరిష్కార చాతుర్యం వల్లనో, ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం దయాదాక్షిణ్యాల వల్లనో తమ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఏనాడూ వారిని ప్రాధేయపడ లేదు. తెలంగాణ జనానికి తమ శక్తిపైనే విశ్వాసం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో తాము పడిన కష్టనష్టాలు వారిని ముందుకు నడిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఐక్యంగా, ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయారు. సకల జనుల సమ్మె ప్రభావం వల్ల ఢిల్లీ పెద్దలలో కదలిక వచ్చింది. తెలంగాణ సాధించుకుని తీరవలసిందే. అప్పటి వరకు జనం విశ్రమించరు. ఉద్యమం ఆగేది లేదు.